English Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Assamese

Books

Joshua Chapters

1 యెహోవా సేవకుడు మోషే. నూను కుమారుడైన యెహోషువ, మోషేకు సహాయకుడు. మోషే చనిపోయాక యెహోషువతో యెహోవా మాట్లాడాడు. యెహోషువతో యెహోవా అన్నాడు:
2 “నా సేవకుడు మోషే మరణించాడు. ఇప్పుడు నీవు, ఈ ప్రజలు వెళ్లి యోర్దాను నది దాటండి. ఇశ్రాయేలు ప్రజలైన మీకు నేను ఇస్తున్న దేశంలోకి మీరు వెళ్లాలి.
3 ఈ దేశాన్ని నేను మీకు ఇస్తానని మోషేకు వాగ్దానం చేసాను. కనుక మీరు వెళ్లే ప్రతి చోటునూ నేను మీకు ఇస్తాను.
4 హిత్తీ ప్రజల దేశం అంతా, అంటే ఎడారి, లెబానోను మొదలుకొని మహానది వరకునున్న (యూఫ్రటీసు) దేశమంతా మీదే. మరియు ఇక్కడ నుండి పశ్చిమాన మధ్యధరా సముద్రం వరకు (అది సూర్యాస్తమయ దిశ) మీ సరిహద్దు.
5 నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నీకు తోడుగా వుంటాను. నీ జీవితాంతం నిన్నెవ్వరూ అడ్డగించలేరు. నేను నిన్ను విడిచి పెట్టను. ఎన్నటికీ నిన్ను నేను ఎడబాయను.
6 “యెహోషువా, నీవు బలంగా, ధైర్యంగా ఉండాలి! ఈ ప్రజలు వారి దేశాన్ని స్వాధీనం చేసుకోగలిగేటట్టు నీవు ఈ ప్రజలను నడిపించాల్సి ఉంటుంది. వారి పితరులకు ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశం ఇది.
7 అయితే నీవు మరో విషయంలో కూడ బలంగా, ధైర్యంగా ఉండాలి. నా సేవకుడు మోషే నీకు ఇచ్చిన ఆజ్ఞలను పాటించే విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలి. అతని ప్రబోధాలను నీవు సరిగ్గా పాటిస్తే, నీవు చేసే ప్రతి పనిలోనూ నీకు విజయం కలుగుతుంది.
8 ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాలను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. ఆ గ్రంథాన్ని రాత్రి, పగలు ధ్యానించు. అప్పుడు అందులో వ్రాయబడిన విషయాలను పాటించగలుగుతావు. నీవు ఇలా చేస్తే, నీవు చేసే ప్రతీదీ తెలివిగా, విజయవంతంగా చేయగలుగుతావు.
9 నీవు బలంగా ధైర్యంగా ఉండాలని నేను ఆజ్ఞాపించినట్టు జ్ఞాపకం ఉంచుకో. అందుచేత భయపడవద్దు. ఎందుచేతనంటే? నీవు వెళ్లే ప్రతిచోటా నీ యెహోవా దేవుడు నీకు తోడుగా ఉంటాడు గనుక.”
10 కనుక యెహోషువ ప్రజానాయకులకు ఆదేశాలు ఇచ్చాడు. అతడు చెప్పాడు:
11 “గుడారాల్లోనికి వెళ్లి ప్రజలను సిద్ధంగా ఉండమని చెప్పండి. ప్రజలతో ఇలా చెప్పండి, ‘భోజనం తయారు చేసుకోండి. మూడు రోజుల్లో మనం యోర్దాను నది దాటాలి. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని మనం వెళ్లి తీసుకొందాము.’ ”
12 తర్వాత రూబేను, గాదు, మనష్షే వంశంలో సగభాగం వారితో యెహోషువ మాట్లాడాడు. యెహోషువ చెప్పాడు:
13 “యెహోవా సేవకుడు మోషే మీతో ఏమి చెప్పాడో జ్ఞాపకం చేసుకోండి. మీకు విశ్రాంతి కోసం మీ దేవుడైన యెహోవా మీకు ఒక స్థలం ఇస్తాడు అని అతడు చెప్పాడు. ఆ దేశాన్ని యెహోవా మీకు యిస్తాడు.
14 ఇప్పుడు యోర్దాను నదికి తూర్పున ఉన్న ఈ దేశాన్ని యెహోవా మీకు ఇచ్చాడు. మీ భార్యలు, మీ పిల్లలు, మీ పశువులు ఈ దేశంలో నివసించవచ్చు. అయితే యుద్ధం చేసే మీ పురుషులంతా మీ సోదరులతో కలిసి యోర్దాను నది దాటాలి. మీరు యుద్ధానికి సిద్ధపడి మీ సోదరులు వారి దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు సహాయపడాలి.
15 విశ్రాంతి కోసం యెహోవా మీకు ఒక స్థలం ఇచ్చాడు. మీ సోదరుల కోసం కూడా యెహోవా అలాగే చేస్తాడు. అయితే యెహోవా దేవుడు వారికి ఇస్తున్న దేశాన్ని మీ సోదరులు స్వాధీనం చేసుకొనేంతవరకు మీ సోదరులకు మీరు సహాయం చేయాలి. అప్పుడు యోర్దానుకు తూర్పున ఉన్న మీ దేశానికి మీరు వెళ్లిపోవచ్చు. యెహోవా సేవకుడు మోషే మీకు ఇచ్చిన దేశం అది.”
16 అప్పుడు ప్రజలు యెహోషువాకు బదులు చెప్పారు: “మమ్మల్ని ఏమి చేయమని నీవు ఆజ్ఞాపిస్తే, మేము అలా చేస్తాము. నీవు మమ్నల్ని ఎక్కడికి పంపిస్తే మేము అక్కడికి వెళ్తాము.
17 మేము మోషేకు పూర్తిగా విధేయులం అయ్యాము. అలాగే, నీవు చెప్పే ప్రతిదానికీ మేము విధేయులవుతాము. ఒక్క విషయం మాత్రమే మేము యెహోవాను అడుగుతాము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడుగా ఉన్నట్టే నీకునూ తోడుగా ఉండాలని అడుగుతాము.
18 తర్వాత, ఎవరైనా నీ ఆజ్ఞలను తిరస్కరించినా, లేక ఎవరైనా నీమీద తిరుగుబాటు చేసినా అలాంటివాడు చావాల్సిందే. బలంగా, ధైర్యంగా ఉండు!”
×

Alert

×